||సుందరకాండ ||

||అరువది సర్గ తెలుగులో||

||ఓమ్ తత్ సత్||
శ్లో|| తస్య తద్వచనం శ్రుత్వా వాలిసూనురభాషత|
అయుక్తం తు వినా దేవీం దృష్టవద్భిశ్చ వానరాః||1||
సమీపం గన్తుమస్మాభీ రాఘవస్య మహాత్మనః|
తా|| హనుమంతునియొక్క ఆ వచనములను విని వాలిపుత్రుడు ఇట్లు పలికెను." ఓ వానరులారా మనచేత చూడబడినా కాని, ఆ సీతాదేవి లేకుండా మహత్ముడైన రాఘవుని సమీపమునకు పోవుట యుక్తముకాదు.
||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ షష్టితమస్సర్గః||

హనుమంతునియొక్క ఆ వచనములను విని వాలిపుత్రుడు ఇట్లు పలికెను.

'ఓ వానరులారా మనచేత చూడబడినా కాని, ఆ సీతాదేవి లేకుండా మహత్ముడైన రాఘవుని సమీపమునకు పోవుట యుక్తముకాదు. ప్రఖ్యాతి చెందిన మీ అందరిచేత దేవిని చూచితిమి కాని తీసుకురాలేదు అని చెప్పుట అయుక్తము అని తోచుచున్నది. ఓ వానరోత్తములారా అకాశసంచారములో గాని పరాక్రమము లో గాని దేవతలూ దైత్యులూ కూడిన లోకాలలో మనతో సమానులు ఎవరూ లేరు'.

'రాక్షససమూహమములతో కలిపి లంకను జయించి, యుద్ధములో రావణుని హతమార్చి, సీతను తీసుకొని కార్యము సిద్ధించుకొని ఆనందోత్సాహములతో వెళ్ళుదాము. వారిలోనే అనేక మైన రాక్షసవీరులను హనుమంతుడు హతమార్చాడు. జానకీ దేవిని తోడ్కొని రావడము తప్ప అక్కడ మిగిలిన కార్యక్రమము ఏమి వుంది? రామలక్ష్మణుల మధ్య సీతమ్మను చేర్చుదాము'.

'ఇన్నిమాటలు ఎందుకు? మిగిలిన వానరుల అవసరములేదు. మనమే వెళ్ళి ఆ రాక్షసపుంగవులను హతమార్చి,లక్ష్మణ సుగ్రీవులతో కూడి ఆ రాఘవుని దర్శించుదాము'.

ఈ విధముగా సంకల్పించిన హరిసత్తమునికి , పరమప్రీతితో అర్థవంతమైన మాటలు జాంబవంతుడు పలికెను.

'ఓ మహా కపి సత్తమా, నీవు చెప్పుచున్న ఆలోచన సముచితము కాదు. మనము దక్షిణ దిశలో అన్వేషణకు పంపబడిన వారము. ఆమెను తీసుకు రమ్మని ధీమంతుడైన రాముడు గాని కపిరాజుకాని చెప్పలేదు. మనము జయించి సీతను తీసుకు పోవుట వారికి నచ్చక పోవచ్చు. రాజ సింహుడైన రాఘవుడు స్వయముగా సీతతో విజయము సాధించెదనని ప్రతిజ్ఞ చేసినవాడు. ఆ మాటకి విరుద్ధముగా వానర ముఖ్యులు ఎలా చేయగలరు? అలా చేసిన కర్మవిఫలమగును, దానితో సంతోషము కూడా వుండదు. చూపించిన ధైర్య సాహసములు వృథా అగును.'

'అందుకని మనము అందరము రామలక్ష్మణులు ఎక్కడ వున్నారో అక్కడికి వెళ్ళి, మహాతేజోవంతులైన రామలక్ష్మణు లకు సుగ్రీవునకు చేసిన కార్యము నివేదించెదము'.

'ఓ రాజపుత్రా ! నీ సూచన సముచితమైనప్పటికీ నా బుద్ధి అంగీకరించుట లేదు. రాముని మనస్సు ఎలావున్నదో తెలిసికొని ఆవిధముగా కార్యసిద్ధి కలిగించుటకు విధానము చూడతగినది'.

జాంబవంతుని మాటలతో అరువదియవ సర్గ అంతమగును.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే షష్టితమస్సర్గః ||

||ఓమ్ తత్ సత్||
శ్లో|| న తావదేషా మతి రక్షమానో యథా భవాన్పశ్యతి రాజపుత్త్ర|
యథా తు రామస్య మతిర్నివిష్టా తథా భవాన్పశ్యతు కార్యసిద్ధిమ్||14||
తా|| 'ఓ రాజపుత్రా ! నీ సూచన సముచితమైనప్పటికీ, నా బుద్ధి అంగీకరించుట లేదు. రాముని మనస్సు ఎలావున్నదో తెలిసికొని ఆవిధముగా కార్యసిద్ధి కలిగించుటకు విధానము చూడతగినది'.
||ఓమ్ తత్ సత్||